EPS Pension: కనీస పెన్షన్ రూ.7500లకు పెరిగిందా? ఈపీఎఫ్ఓ సమావేశంలోని నిర్ణయాలు ఇవే.. | EPS Pension 2025 Hike EPFO Decission
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అత్యున్నత నిర్ణయాధికార విభాగం అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (CBT) సమావేశం ఈసారి ఎంతో ఉత్కంఠను రేకెత్తించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ భేటీపై ప్రభుత్వ పెన్షనర్లు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రధాన డిమాండ్ – EPS కనీస పెన్షన్ పెంపు (రూ.1000 నుంచి రూ.7500లకు) – ఈసారి నెరవేరుతుందని గట్టిగా నమ్మారు. అయితే, సమావేశం ముగిసిన తర్వాత వెలువడిన వార్తలు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి.
కనీస పెన్షన్ పెంపుపై నిరాశే! రూ.7500 డిమాండ్ ఏమైంది?
వేలాది మంది ఈపీఎస్-95 పెన్షనర్లు చాలా కాలంగా నెలకు కనీసం రూ.7500 పెన్షన్‌గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌పై ఈపీఎఫ్ఓ సీబీటీ భేటీలో కనీసం చర్చ జరుగుతుందని, కనీసం రూ.2500లకు పెంచే నిర్ణయమైనా తీసుకుంటారని అంతా భావించారు. కానీ, వారి అంచనాలు తప్పాయి. EPS కనీస పెన్షన్ పెంపు అంశం సీబీటీ అజెండాలో లేకుండా పోయింది. దీంతో, పెన్షనర్లు తమ అసంతృప్తిని, ఆందోళనను తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలు ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ, కనీస పెన్షన్ పెంపుపై సీబీటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది.
అయితే, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా స్పందన కొంత ఊరట కలిగించింది. EPS కనీస పెన్షన్ పెంపు అంశం ప్రస్తుతం కేంద్ర కేబినెట్ పరిశీలనలో ఉందని, త్వరలోనే కేబినెట్ ఈ విషయమై నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. సీబీటీలో చర్చ జరగకపోయినా, అత్యున్నత స్థాయిలో ఈ డిమాండ్ ఇంకా సజీవంగా ఉందన్న విషయం పెన్షనర్లకు కాస్త ధైర్యాన్నిచ్చింది. ఏది ఏమైనా, రూ.7500 EPS కనీస పెన్షన్ పెంపు కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది.
పీఎఫ్ విత్ డ్రా నిబంధనల్లో భారీ మార్పులు: ఉద్యోగులకు శుభవార్త!
కనీస పెన్షన్ అంశంలో నిరాశ ఉన్నప్పటికీ, ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో ప్రావిడెంట్ ఫండ్ (PF) పాక్షిక ఉపసంహరణ నిబంధనలకు సంబంధించి మాత్రం కీలకమైన, ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాత సంక్లిష్టమైన 13 రకాల నిబంధనలను క్రమబద్ధీకరించి, వాటిని కేవలం మూడు విభాగాలుగా విభజించారు. అవి: ముఖ్యమైన అవసరాలు (ఆరోగ్యం, విద్య, వివాహం), గృహ అవసరాలు మరియు ప్రత్యేక పరిస్థితులు.
ముఖ్యంగా, పీఎఫ్ విత్ డ్రా పరిమితులు భారీగా పెంచడం ఉద్యోగులకు అతి పెద్ద ఉపశమనం.
- పూర్తి విత్ డ్రా అవకాశం: ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి ఉద్యోగి మరియు యజమాని వాటా సహా, అర్హమైన పీఎఫ్ నిధిలో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని (100 శాతం) ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుంది.
- విత్ డ్రా సంఖ్య పెంపు: విద్య, వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునే పరిమితిని ఐదు రెట్లు పెంచారు. ఇంతకుముందు ఈ రెండింటికీ కలిపి కేవలం మూడుసార్లు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం, చదువుల కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈ నిర్ణయాలు ఉద్యోగులకు ఆర్థిక భద్రతను పెంచడంతో పాటు, వారి అత్యవసర అవసరాలను తీర్చుకునే విషయంలో వెసులుబాటు కల్పించాయి. అయినప్పటికీ, లక్షలాది మంది వృద్ధ పెన్షనర్ల జీవితాలపై ప్రభావం చూపే EPS కనీస పెన్షన్ పెంపు అంశంపై త్వరగా కేంద్ర కేబినెట్ నుంచి సానుకూల నిర్ణయం రావాలని అంతా ఎదురుచూస్తున్నారు.
| Also Read.. |
|---|











